ముంబై : దేశంలోని మూడవ అతిపెద్ద ప్రైవేట్ రంగ రుణదాత యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్ కు కోవిడ్-19 షాక్ తగిలింది. మార్చి 31తో ముగిసిన నాల్గవ త్రైమాసికంలో రూ. 1,388 కోట్ల నష్టాన్ని చవి చూసింది. అంతకు ముందు సంవత్సరం 1,505 కోట్ల రూపాయల లాభాన్ని సాధించింది. తాజా ఫలితాలతో విశ్లేషకులు అంచనాలను బ్యాంకు తారుమారు చేసింది. విశ్లేషకులు 1,556 కోట్ల రూపాయల లాభాలను అంచనా వేశారు. మంగళవారం మార్కెట్ ముగిసిన తరువాత బ్యాంకు తన ఫలితాలను ప్రకటించింది. మరోవైపు నికర వడ్డీ ఆదాయం సంవత్సరానికి 16 శాతం పెరిగి రూ. 25,206 కోట్లకు చేరుకుంది.
గత సంవత్సరంతో పోలిస్తే దాదాపు మూడు రెట్లు అధికంగా ప్రొవిజన్లు నమోదయ్యాయి. గత ఏడాది 3,000 కోట్లు తో పోలిస్తే ఈ త్రైమాసికంలో 7,730 కోట్లుగా ఉన్నాయని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో యాక్సిస్ బ్యాంకు వెల్లడించింది. అయితే స్థూల బ్యాడ్ లోన్ల బెడద 4.86 శాతానికి తగ్గింది. మార్చిలో ముగిసిన త్రైమాసికంలో నికర ఎన్‌పిఎలు 1.56 శాతానికి తగ్గాయి.